న్యూఢిల్లీ: దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనాభా లెక్కల (Census) ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి తొలి విడత జనగణన ప్రారంభం కానుంది. ఈసారి జనాభా లెక్కలతో పాటు ‘కుల గణన’ కూడా చేపట్టడం విశేషం. పౌరులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ఈసారి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది.
తొలిసారిగా ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ (స్వయంగా నమోదు)
ఈ సారి జనగణనలో అతిపెద్ద మార్పు ఏమిటంటే.. పౌరులు ఎన్యుమరేటర్లు ఇంటికి రాకముందే తమ సమాచారాన్ని ఆన్లైన్లో స్వయంగా నమోదు చేసుకోవచ్చు. దీనినే ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ అంటారు. ఇంటింటి సర్వే ప్రారంభానికి 15 రోజుల ముందే ఈ ఆప్షన్ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. భారత్లో నివసిస్తున్న వారు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
India census-2026 : మీ ఇంటికి వస్తే అడిగే ఆ ’33 ప్రశ్నలు’ ఇవే!
మొదటి దశలో గృహ గణన (Housing Census) చేపడతారు. ఇందులో భాగంగా అధికారులు మీ ఇంటికి వచ్చి ప్రధానంగా 33 రకాల ప్రశ్నలు అడుగుతారు:
- ఇంటి నిర్మాణం: ఫ్లోరింగ్, గోడలు, పైకప్పుకు వాడిన మెటీరియల్ ఏంటి?
- సౌకర్యాలు: ఇంట్లో ఎన్ని జంటలు నివసిస్తున్నాయి? కుటుంబ పెద్ద ఎవరు?
- ఆహారం & వస్తువులు: ఏ రకమైన ధాన్యాలు వాడుతున్నారు? ఇంట్లో ఉన్న వాహనాలు (సైకిల్, స్కూటర్, కార్ మొదలైనవి) ఏవి?
- ఆస్తి వివరాలు: అద్దె ఇంట్లో ఉంటున్నారా లేక సొంత ఇల్లా? వేరే చోట ఏవైనా ఆస్తులు ఉన్నాయా?
తెలంగాణలో షెడ్యూల్ ఇదే (ఏప్రిల్ 26 నుంచి మొదలు)
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ప్రత్యేక తేదీలను ప్రకటించింది: సెల్ఫ్-ఎన్యుమరేషన్: ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఇంటింటి సర్వే: మే 11 నుంచి జూన్ 9 వరకు అధికారులు మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు.
సహజీవన జంటలకు ‘ఫ్యామిలీ’ హోదా!
ఈసారి జనగణనలో కొన్ని కీలక మార్పులు చేశారు. ఎఫ్ఏక్యూ (FAQ)ల ప్రకారం.. సహజీవనం (Live-in relationship) చేస్తున్న జంటలు తమ బంధం స్థిరమైనదని భావిస్తే, వారిని ‘వివాహిత జంట’గానే పరిగణించి కుటుంబ హోదా కల్పిస్తారు.
ముఖ్య గమనికలు:
- డాక్యుమెంట్లు అవసరం లేదు: జనాభా లెక్కల కోసం పౌరులు ఎలాంటి ఆధార్ కార్డులు లేదా ఇతర పత్రాలను అధికారులకు సమర్పించాల్సిన అవసరం లేదు.
- గోప్యత: మీరు ఇచ్చే సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుంది. దీన్ని కోర్టుల్లో సాక్ష్యంగా గానీ, ఇతర సంస్థలతో గానీ పంచుకోరు.
- రెండో దశ: వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ (Population Enumeration) జరుగుతుంది.
