పన్ను బకాయిలపై..దండయాత్ర – House Tax Collection

House Tax Collection
  • ఇంటి పన్నుల వసూళ్లలో కర్కశత్వం
  • అవకాశం ఇవ్వకుండా ప్రజల పరువు హననం
  • స్థలానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు కదా!
  • ఇంటి అనుమతలకు రుసుము కట్టారు కదా!
  • వసూలు చేసే పన్నులకు సరిపడా సేవలు అందుతున్నాయా?
  • వానరాలు, శునకాల దాడులకు బాధ్యులు ఎవరు?
  • కోతులు, కుక్కల దాడిలో మరణించిన కుటుంబాలకు దిక్కెవరు?
  • పన్నులు కట్టకుంటే తలుపులు, తపేలాలు జప్తు చేస్తారా
  • కుంభకర్ణుడిలా నిద్రించి.. బకాసురుడిలా ఊళ్ల మీద పడతారా అంటూ ప్రశ్నిస్తున్న నగరవాసులు

House Tax Collection | పన్ను పోటు ఎలా ఉంటుందో ప్రజలకు తెలియంది కాదు. పుచ్చిపోయిన పన్ను కలిగించే నొప్పి ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. అది తొలిగించే వరకు, తొలగించేటప్పుడు ఏర్పడే నొప్పి అసలు పండ్లు లేకుంటే బాగుండు అనేంత బాధను దిగమింగుకుంటారు. అయితే, ఇది ఒక వ్యక్తి లేదా కొంతమంది అనుభవించే వ్యక్తిగతమైన నొప్పి మాత్రమే. కానీ, సమాజం మొత్తం ఒకేసారి బాధపడేలా చేసే పన్ను.. ఇంటి పన్ను. ఇప్పుడు పల్లె స్థాయి నుంచి పట్టణాల స్థాయి వరకు ప్రజలు అనుభవిస్తున్న మనోవ్యథ. నోట్లో పన్ను కలిగించే పన్ను నొప్పి కంటే వందరెట్లు అధికంగా ఇంటి పన్నుతో ఎదుర్కొంటున్న కడు దయనీయ పరిస్థితి. దేశవ్యాప్తంగా ఒకపక్క పశ్చిమాసియా యుద్ధం ప్రభావంపై చర్చ జరుగుతుంటే సామాన్య ప్రజానీకంలో మాత్రం ఇంటి పన్నుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇంటి పన్నుల వసూళ్ల పర్వం… తిన్న తిండి కూడా ఒంట పట్టకుండా చేస్తోందని ప్రజలు కన్నీటిని దిగమింగుకోవాల్సిన పరిస్థితులు రామాయణంలో సీతమ్మకే అర్థమవుతాయేమో!

ఊరంతా ఒక్కదారి ఉలిపిరి కట్టది ఇంకోదారి!

ఏటా మార్చి రాగానే అందరి దృష్టి దేశ, రాష్ట్ర బడ్జెట్పై ఉంటుంది. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? వేటి రేట్లు తగ్గుతాయనే ఆలోచనల్లోనే ఉంటారు. ప్రజలంతా బడ్జెట్ పై మనసు లగ్నం చేస్తే గ్రామ పంచాయతీ, నగర పాలక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ల అధికారుల మాత్రం.. ప్రజలను పన్నుల రూపంలో వేధించడంపై దృష్టిసారించడం గమనార్హం. ప్రతీ మూడు నెలలకోసారి అప్డేట్ చేసే ఇంటి పన్నులను.. ఆర్థిక సంవత్సరం చివరి వరకు వసూలు చేయకుండా.. ఏడాది ఆఖరున ఒకేసారి చెల్లించాలంటూ ప్రజల మెడ మీద కత్తిపెట్టినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఊరంతా ఒక్కదారి అయితే.. ఉలిపిరి కట్టేది ఇంకోదారి అన్నట్లుగా.. బడ్జెట్లో భారం తగ్గుతుందా జనం చూస్తుంటే.. అధికారులు మాత్రం పన్నుల కోసం ఇళ్ల ముందు గద్దల్లా వాలిపోవడం ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది. కుంభకర్ణుడి నిద్ర ఆరు నెలలే!
కుంభకర్ణుడు ఆరు నెలలే నిద్రపోతాడట! కానీ, మున్సిపల్ అధికారులు పదకొండు నెలల తర్వాత పన్నుల వసూళ్ల కోసం నిద్రావస్థ నుంచి తేరుకుంటున్నారు. ఆకలిగొన్న బకాసురుడు ఒక్కసారిగా ఊళ్ల మీద పడి భీభత్సం సృష్టించినట్లు.. ఇంటి పన్నుల కోసం అధికారులు ప్రజల ఇళ్ల మీదపడి కర్కశంగా వ్యవహరిస్తున్నారని జనం ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మున్సిపాలిటీల్లో మూడు నెలలకోసారి ఇంటి పన్నులను అప్డేట్ చేస్తుంటారని తెలుసు. ఎప్పటికప్పుడు ఆ సమాచారం ప్రజలకు చెప్పకుండా ఏకంగా ఏడాది పన్ను మొత్తం ఒకేసారి కట్టాలంటూ ప్రతీ పదకొండు నెలలకు ప్రజలను ఇబ్బంది గురిచేయడం పట్ల జనాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. అధికారులను ప్రశ్నించలేక పన్నులు కట్టేందుకు ఆపసోపాలు పడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు.

అటు యుద్ధం.. ఇటు పన్నుల పోరాటం..

ఒకపక్క నిత్యావసర సరుకులు మండిపడుతున్నాయి. మరోపక్క ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వల్ల పరిస్థితులు రోజురోజుకు విపత్కరంగా మారుతున్నాయి. ఆ యుద్ధంతో ఇప్పటికే పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి.. ఇంకా కొనసాగితే మానవ జీవనం కుంటుపడుతుందని, కనీసం నిత్యావసరాలైన లభించే పరిస్థితులు ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పన్నులు చెల్లించాలంటూ అధికారులు ఒత్తిడి చేయడం సహేతుకం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అధికారులా? ఆకు రౌడీలా?

ఒకవేళ ఇప్పటికిప్పుడు పన్నులు కట్టలేని స్థితిలో ఉన్న వారిపై అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని పలు సంఘటనలతో రూఢీ అవుతోంది. వరంగల్ జిల్లా పరకాల పట్టణంలో మున్సిపల్ అధికారులు పన్ను చెల్లించలేని ఓ యజమాని ఇంటి తలుపులు దౌర్జన్యంగా లాక్కెళ్లిన వ్యవహారం సోషల్మీడియాలో వైరల్గా మారింది. వరంగల్ మహానగరంలోనూ పలు ప్రాంతాల్లో అధికారులు వీధి రౌడీల్లా ఇళ్లలోకి చొరబడి చేతికందిన వస్తు సామగ్రిని లాక్కెళ్తున్న సంఘటనలు వెలుగుచూశాయి. ఈ ప్రాంతాల్లోనే అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోనూ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

చట్టంలో తలుపులు తీసుకెళ్లమని ఉందా?

ఇంటి పన్నులు చెల్లించకుంటే.. తలుపులు తీసుకెళ్లొచ్చని మున్సిపల్ చట్టంలో ఉందా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లక్షల్లో బకాయిలు పడిన బడాబాబుల పట్ల ఉదాసీనత ప్రదర్శించే అధికారులకు పేదలు, సామాన్య ప్రజానీకమే చులకనగా కనబడుతున్నారా? అంటూ ఆవేదన చెందుతున్నారు. ఏడాది పన్నులు ఒకేసారి కట్టాలంటే నిరుపేదలకు ఎలా సాధ్యమవుతుందని మధనపడుతున్నారు. మళ్లీ పన్నులు అప్డేట్ చేయడానికి మూడు నెలల సమయం ఉంటుంది.. ఆలోగా వాయిదా అవకాశాలు ఇవ్వచ్చు కదా? అని అభిప్రాయపడుతున్నారు.

House Tax Collection : లక్ష్యం.. నిర్లక్ష్యం వాళ్లదే.. నిరంకుశత్వం ప్రజల మీదా?

వాస్తవానికి ప్రతీ మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి ఇంటి పన్నులు అప్డేట్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు ఆ వివరాలు ప్రజలకు చేరవేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పన్నుల వసూళ్ల తీరు స్పష్టం చేస్తోంది. వంద శాతం పన్నుల వసూళ్లు లక్ష్యంగా ఏడాది చివరన ప్రజల మీద పడడం నిరంకుశత్వం కాదా అంటూ ప్రజలు మండిపడుతున్నారు.

పన్నులు సరే.. పరిచర్యలేవి?

పన్నులు వంద శాతం వసూలు చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్న ఆ పన్నులు వేసే సేవలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో లైబ్రరీ సేవల కింద పన్ను విధిస్తున్నారు. మరి ఎన్ని పట్టణాలు, ఎన్ని నగరాలు, ఎన్ని గ్రామాల్లో లైబ్రరీలు ఉన్నాయో అధికారులే చెప్పాలని ప్రజలు మండిపడుతున్నారు. వీధి లైట్లకు పన్నులు వసూలు చేస్తున్న అధికారులు.. కొన్ని కాలనీల్లో నెలల తరబడి వెలగని వీధి దీపాలకు ఎలా పన్ను విధిస్తారని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆహ్లాదపు పన్ను పరిస్థితి అంతే. ఏ నగరంలోనైనా పార్కులు సక్రమంగా ఉన్నాయా? ఉన్నవాటిలో ఏపాటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో..? అధికారులే సెలవివ్వాలి. అంతేకాదు, ఇటు పన్ను విధిస్తూనే.. కొన్ని నగరాల్లో పార్కుల్లో ప్రవేశ రుసుము పేరిట టికెట్లు పెట్టి ప్రజల నుంచి ఒక్కొక్కరికి రూ.30 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు.

మూత్రం పోయడానికీ పైసలే కదా!

నగరం, మహానగరం అంటూ ఊదరగొడుతూ ఏటా పన్నులు వసూలు చేస్తున్న అధికారులు.. ఆ మేరకు ప్రజలకు కనీసం కనీస సౌకర్యాల కల్పిస్తున్నారా? ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రజలు అత్యవసరంగా మూత్రం వస్తే.. డబ్బులు చెల్లిస్తే గానీ ఒంటికి పోయే పరిస్థితులు ఉన్నాయా? ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలో గ్రీనరీ సెస్ కింద ప్రజల నుంచి రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. మరి.. ఎండలు విపరీతంగా ఉన్న సమయంలో ప్రజలు సేదతీరేందుకు నీడనిచ్చే ఒక్క చెట్టయినా నగరంలో ఉందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అసౌకర్యాలు.. అయినా పన్నుల వసూళ్లే లక్ష్యంగా ఆగమేఘాల మీద ప్రజలను అసౌకర్యానికి గురిచేయడం.. సమాజంలో ఇతరుల ముందు పరువు తీసేలా తలుపులు.. తపేలాలు లాక్కెళ్లడం.. ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును హరించడం కాదా? ప్రజల మనోభావాలను హననం చేయడం కాదా? అధికారులే సమాధానం చెప్పగలగాలి.

అసలు ఇంటి పన్ను ఎందుకు?

పన్నుల వసూళ్ల అధికారుల ప్రవర్తన తీరుతో అసలు ఇంటి పన్ను ఎందుకు కట్టాలి? అనే ప్రశ్నలు వేస్తున్నారు ప్రజలు. ‘ఇంటి కోసం కొనే స్థలం రిజిస్ట్రేషన్ సమయంలో వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తున్నాం. ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ లేదా పంచాయతీల్లో అనుమతుల కోసం వేలల్లోనే రుసుము చెల్లిస్తున్నాం.. అయినా మళ్లీ ఇంటి పన్ను విధించడమేమిటి..? అని ప్రజలు తల పట్టుకుంటున్నారు. తమ ఇంటికి ప్రత్యేకంగా ఏమైనా రక్షణ కల్పిస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏ వస్తువైనా ఒకసారి కొంటే.. దాని ధరతో వివిధ రకాల పన్నులు కూడా చెల్లిస్తాం.. ఆ తర్వాత ఆ వస్తువుపై ఎలాంటి పన్నులు వసూలు చేసే అవకాశం ఉండదు.. ఇంటి స్థలం, నిర్మాణం సమయంలోనూ అలాగే ట్యాక్స్లు కడుతున్నాం.. మళ్లీ జీవితాంతం పన్నులు ఎందుకు చెల్లించాలని ధర్మసందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాలు అంటే నిత్యం రోడ్డు మీద తిరుగుతున్నాయి కాబట్టి.. రోడ్డు ట్యాక్స్ వేస్తున్నారు.. మరి ఇళ్లు ఎక్కడ తిరుగుతోంది? ఒక చోట ఉన్న ఇల్లు మరోచోటికి తీసుకెళితే కదా? పన్ను వసూలు చేసేది అంటూ ఆసక్తికర చర్చకు ప్రజలు తెరలేపారు.

కోతులు, కుక్కలతో ప్రాణ సంకటం!

ఏటా వివిధ రకాల పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు.. ప్రజలకు ఏపాటి సేవలు చేస్తున్నారో? ఎంత ఘనంగా రక్షణ చర్యలు చేపడుతున్నారో.. ఊరూ, వాడా తిరిగే కుక్కలు, కోతులే చెబుతాయని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. నగరాలే కాదు.. పల్లెల్లో కూడా కుక్కలు, కోతుల బెడద నుంచి ప్రజలకు రక్షణ లేకుండా పోయిందనడానికి వాటి దాడుల్లో ప్రజలు గాయపడిన సంఘటనలే నిదర్శనం. కొన్నిచోట్ల అవి చేసిన గాయాలు ప్రాణాల తీసిన దుర్ఘటనలు లేకపోలేదు. మొన్నటికి మొన్న హన్మకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలో ఓ ఎస్ఐసీ ఏజెంట్ కోతుల బారినుంచి తప్పించుకోబోయి గాయాలపాలై.. చివరకు చికిత్సపొందుతూ మరణించాడు. ఇదొక్కటే.. తెలంగాణలో మరెందరో కుక్కలు, కోతుల దాడిలో బలైన వారు చాలామందే ఉన్నారు. పసిపిల్లలు కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి బలవంతంగా, దౌర్జన్యంగా, వీధి రౌడీల్లా ఇళ్ల మీద పడి.. పన్నులు వసూలు చేయడం.. ఏ చట్టంలో ఉంది? అంటూ ప్రజలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.

హత్య చేసిన వ్యక్తికి వాయిదాల విచారణ తర్వాతే శిక్ష!

హత్య చేసిన వారికి కూడా కోర్టులు ఒక్కసారే శిక్ష విధించవు. ఒకవేళ అనవసరంగా ఆ కేసులో ఇరుక్కున్న వారుంటే తగిన న్యాయం పొందేందుకు వారికి వాయిదాలు అనే అవకాశం కల్పిస్తుంది. పలుమార్లు విచారణ చేపట్టిన తర్వాతే శిక్ష ఖరారు చేస్తుంది. కానీ, ఇంటి పన్నుల విషయంలో ఏడాది కాలానికి సంబంధించిన పన్ను మొత్తం ఒకేసారి చెల్లించాలని పట్టుబట్టడం.. దౌర్జన్యానికి పాల్పడడం.. వ్యక్తుల స్వేచ్ఛా జీవనపు హక్కును హరించడం కాదా? అని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 300 రూపాయల విలువ చేసే సెన్కార్డు రీచార్జ్ కోసం ఎక్కడో ఉండే ఆయా టెలికాం సంస్థలు.. వారం రోజుల ముందు నుంచే వినియోగదారులకు ఫోన్ చేయడం ద్వారానో, లేదా మెసేజ్ రూపంలోనో అప్రమత్తం చేస్తుంటాయి. మరి.. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించే అధికారులు.. మూడు నెలలకోసారి చెల్లించాల్సిన పన్నును యేడాది చివరన చేరవేసి.. ఉన్నపళంగా చెల్లించాలనడం సహేతుకం కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు అందించాల్సిన సేవల్లో నిర్లక్ష్యం, లోపాలు పెట్టుకుని.. పన్నుల వసూళ్ల కోసం.. కమిషనర్ సహా అధికారుల కార్ల డ్రైవర్లు సైతం పన్నుల వేటలో దిగడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మేయరే మొన్న కట్టారు!

పన్నుల కోసం ప్రజలను ఒత్తిడి గురి చేస్తున్న అధికారులు.. ప్రజాప్రతినిధులు, బడాబాబుల విషయంలో ఔదార్యం ప్రదర్శిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజానీకం ముక్కుపిండీ, ఇంట్లో వస్తువులు జప్తు చేసేందుకు కూడా వెనకాడని అధికారులు.. ప్రజాప్రతినిధులు, బడాబాబుల పన్నుల వివరాలు బహిర్గతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ మహానగర మేయర్.. తన ఇంటి పన్ను, తన కుటుంబీకుల పేరిట గల హెూటల్ పన్ను రూ. 5లక్షలు ఇటీవల చెల్లించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది కూడా పత్రికల్లో వార్తలు వచ్చాకే.. ఆమె పన్నులు చెల్లించారని, లేదంటే ఆ విషయాన్ని అధికారులు పట్టించుకునేవారే కాదని విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు ఒక లెక్క.. సామాన్య ప్రజానీకానికి మరో లెక్కనా అంటూ మండిపడుతున్నారు. తాము ఇళ్లు పట్టుకుని మరో చోటికి ఏం వెళ్లమని.. ముందుగా ప్రజాప్రతినిధులు, బడాబాబుల పన్నులు వసూలు చేశాక, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొచ్చని.. అప్పటివరకు ప్రజలకు పన్నులు చెల్లించే విషయంలో అవకాశం ఇవ్వాలని, తమ స్వేచ్ఛాజీవనానికి భంగం కలిగించకూడదని, మనోభావాలను హననం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!