- Ghantaravam Effect | సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలపై వరుస కథనాలు ప్రచురించిన ఘంటారావమ్ దినపత్రిక
- గురువారం వరంగల్, వడ్డేపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబి అధికారుల మెరుపు దాడులు
- కీలక డాక్యుమెంట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు
- ఏజెంట్ల వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం
- లోతుగా విచారణ చేపడుతున్న ఏసీబి అధికారులు
(బీ కే) ప్రత్యేక ప్రతినిధి, ఘంటారావమ్ : వరంగల్, హన్మకొండ -వడ్డేపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబి అధికారులు మెరుపు దాడులు చేశారు. ఏసీబి మెరుపు దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పలు రిజిస్టర్ కార్యాలయాల్లో అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని, చట్టాలను చుట్టాలుగా మార్చుకొని కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఇష్టరాజ్యాంగా డాక్యుమెంట్లు చేస్తున్నారని, నిబంధనలను పాతరేసి కాసులే ధ్యేయంగా కొందరు వ్యవహారిస్తున్నారని, డాక్యుమెంట్ల రైటర్ల పెత్తనం పెరిగిపోయిందని “రిజిస్ట్రేషన్ల శాఖలో మా ఇష్టం” అను శీర్షికతో ‘ఘంటారావమ్ దినపత్రిక’లో కథనాలు ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబి అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు చేయడంతో, అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
వరంగల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అనంతరం వడ్డేపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు తలుపులు మూసి తనిఖీలు చేశారు.
మొదటి సబ్ రిజిస్టర్, రెండవ సబ్ రిజిస్టర్ చాంబర్లో రికార్డులు పరిశీలించారు. 20 మంది డాక్యూమెంట్ రైటర్లు 70 డాక్యుమెంట్లు పట్టుకొని లైన్ లో ఉండటాన్ని ఏసీబి అధికారులు గమనించి, ఆరా తీసినట్టు సమాచారం. ప్రస్తుతానికి 45 వేల 500 రూపాయలు ఏజెంట్ల వద్ద నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఏజెంట్లకు సబ్ రిజిస్టర్ సూచన మేరకు 1లక్ష రూపాయలు, 50 వేల రూపాయలు ఇవ్వమని మెసేజ్ చేసిన విధానంను వారి మొబైల్ ఫోన్లలో గుర్తించి పట్టుక్కున్నట్టు కూడా తెలుస్తోంది. మరింత లోతుగా సబ్ రిజిస్టర్ల కార్యాలయాల్లో జరుగుతున్న, జరిగిన అవినీతి, అక్రమాలపై ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
విచారణ చేపడుతున్నాం : DSP సాయిబాబా, అవినీతి నిరోధక శాఖ (ACB)
హన్మకొండ -వడ్డేపల్లిలోని సబ్-రిజిస్ట్రార్, చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించాము. ఈ తనిఖీల్లో సుమారు 20 మంది డాక్యుమెంట్ రైటర్లు అనధికారికంగా 70 డాక్యుమెంట్లు పట్టుకుని ఉండటాన్ని గుర్తించాము. 204 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తి అయినా కూడా ఇవ్వకుండా సబ్ -రిజిస్ట్రార్ తమ వద్దనే పెట్టుకోగా.. వాటిని స్వాధీనం చేసుకొని పరిశీలన చేస్తున్నాము.
కొంతమంది ఏజెంట్ల మొబైల్ ఫోన్లకు పలాన వ్యక్తులకు డబ్బులు ఇవ్వాలి.. పంపాలి అని అధికారులే మెసేజ్ చేయడం, సూచన చేయడం కూడా చేయడాన్ని గుర్తించాము. డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆపివేసి, తమ వద్దనే పెట్టుకున్న డాక్యుమెంట్లపై లోతైన విచారణ చేస్తున్నాము. అలాగే చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయంకు వెళితే.. అటెనెన్స్ రిజిస్టర్ లో హాజరు ఆయునట్టు సంతకాలు ఉన్నాయి.. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో అనుమానం వచ్చి, సదరు అధికారుల, సిబ్బంది తీరుపై కూడా విచారణ చేపడుతున్నాము.
