- ఘంటారావమ్ కథనాలతో కదులుతున్న అవినీతి డొంక
- 20 మంది దళారులు, ఏజెంట్ల అక్రమాల వ్యవహారంపై విచారణ
- ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల ఖాతాలోకి రూ. 42 లక్షలు లంచాల రూపంలో బదిలీ..
- ఇరవై నాలుగు లక్షల నగదు, భారీగా బంగారం, వెండి జప్తు
వరంగల్ : ఘంటారావమ్ వరుస కథనాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ‘తీగ లాగితే డొంక కదిలిన’ చందంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల, 20 దళారుల, ఏజెంట్ల అవినీతి బాగోతం తవ్వినకొద్ది బయటపడుతోంది.
వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక దాడులు (ACB Raids) చేసిన నేపథ్యంలో.. కార్యాలయంలో తిష్టవేసిన ఇరవై మంది దళారులను పట్టుకొగా, లెక్కల్లో లేని లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ ఖాతాలకు మొబైల్ ఫోన్ ద్వారా నలభై రెండు లక్షల రూపాయల లంచాలు బదిలీ అయినట్లు ఏసీబి అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ అవినీతి బాగోతం మొత్తం
దళారుల మొబైల్ ఫోన్ సందేశాల ఆధారంగా వెలుగులోకి వచ్చింది.
అధికారుల నివాసాల్లో ఏసీబి అధికారులు సోదాలు నిర్వహించి ఇరవై నాలుగు లక్షల నగదు, భారీగా బంగారం, వెండి జప్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ముప్పై లక్షల విలువైన పొదుపు పత్రాలు కూడా లభ్యం అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఏసీబి అధికారుల దాడుల్లో పట్టుబడిన నగదు, బంగారం, వెండి, పత్రాలు మొదలగు వాటిపై దర్యాప్తు చేసి, ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసేందుకు ఏసీబి అధికారులు సిద్ధం అయ్యారు.
