- ఎంజీఎంలో నిండుకున్న స్టేషనరీ..
- పెషేంట్ డిశ్చార్జి కార్డులు కరువు
- కానరాని పెషేంట్ కేస్ షీట్ లు
- రోగులనే సొంతంగా తెచ్చుకోవాలంటున్న వైద్యులు, సిబ్బంది
- పేపర్లు, నోట్ బుక్కులు తమనే కొనుక్కోమంటున్నారని పేదల ఆవేదన
వరంగల్ ఎంజీఎం : తెలంగాణ ప్రభుత్వం వెయ్యి పడకలున్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి (MGM Hospital) కి ప్రతినెల 1.2 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు చెబుతోంది. ఆస్పత్రికి వచ్చిన ప్రతి పేషెంట్ కు ఓపి చీటితో పాటు వైద్యం, మందులు ఉచితంగా అందించాలి. ఎంజీఎం పాలన యంత్రాంగం పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టు రోజురోజుకు అద్వాన స్థితికి దిగజారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అవినీతికి, అక్రమాలకు కేరాఫ్ గా మారుతుందన్న ఆరోపణలు సైతం రోగులు వారి బంధువులు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆసుపత్రికి వచ్చే పేద మధ్యతరగతి ప్రజలకు ప్రతిరోజు ఓపి చీటిలతో పాటు అడ్మిట్ అయిన పేషెంట్ కు అన్ని విధాల వైద్య సేవలకు, వారి రోగ లక్షణాలు, ఇతర పరీక్షల రిపోర్టులు నమోదు చేయడానికి పెషేంట్ కేస్ షీట్ తప్పనిసరి. కానీ.. ఎంజీఎంలో పెషేంట్ కేస్ షీట్ లు, డిశ్చార్జ్ కార్డులు లేవని, రోగులనే కొనుక్కోవాలని వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది చెబుతుండటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని, లక్షలు, కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంటే.. కనీస వసతులు ఎందుకు లేవని రోగులు, వారి బంధువులు అధికారులను, రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మందుల చీటిలు, డిశ్చర్జ్ కార్డులు లేకపోవడం ఏంటని ప్రభుత్వ అసమర్ధతపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రింట్ చేసిన, కొనుగోలు చేసిన స్టేషనరి ఏమైంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలను, ప్రకటనలను చూసి సిగ్గు పడాలో.. గర్వ పడాలో అర్థం కావడం లేదని ప్రజలు, రోగులు వాపోతున్నారు.
స్టేషనరి (MGM Hospital issue) ప్రింట్ చేశారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. స్టేషనరి నిండుకున్న అంశంపై ప్రభుత్వం, అధికారులు దృష్టిసారించి ప్రింటింగ్, కొనుగోలుకు సంబందించిన కాంట్రాక్ట్, టెండర్లపై విచారణ చేపట్టాలన్న డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. స్టేషనరి పేరుతో ప్రజాధనంను దుర్వినియోగంకు పాల్పడిన వారిని గుర్తించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
