హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ : భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతం చేసి, మట్టి తరలింపు ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తూ, మే 15 నాటికి పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో భద్రకాళి చెరువు పూడిక మట్టి తరలింపుపై సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా చెరువు నుండి మట్టి డంపింగ్ ప్రాంతాల వరకు వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు పరిస్థితులు తదితర అంశాలపై సాగునీటి పారుదల, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, కుడా అధికారులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భద్రకాళి చెరువు పూడిక మట్టిని రెడ్డిపురం, పలివేల్పుల, మామునూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో డంపింగ్ చేయాలని సూచించారు. మట్టి తరలింపులో ఎటువంటి అవరోధాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో పోలీస్ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. మట్టి తరలింపు సమయంలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఇటుక బట్టీల యజమానుల నుండి మట్టి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామని, గతంలో అనుసరించిన విధానానికి అనుగుణంగా అవసరమైన మట్టికి డీడీలు చెల్లించి తీసుకెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. భద్రకాళి చెరువు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెగ్యులేటరీ పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని, పూడిక మట్టి తరలింపు ప్రక్రియలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని సమర్ధ నిర్వహణకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు ఎన్. రవి, వై.వి. గణేష్, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, సాగునీటి పారుదల సీఈ సుధీర్, ఎస్ఈ రాంప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, కుడా సీపీవో అజిత్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న, సాగునీటి పారుదల శాఖ ఈఈ కిరణ్ కుమార్, డీఈఈ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
