ఉద్యోగులకు మొండిచేయి!

Telangana Govt Employees Protest
  • సర్కారు నిర్ణయంతో గుబులు
  • ఉద్యోగులు కోరిందొకటి.. ప్రభుత్వం చేసిందొకటి!
  • పీఆర్సీ, పెండింగ్ బిల్లులకు బదులు బదిలీల బహుమతి
  • అసలు డిమాండ్లను అటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • డీఏలకు మంగళం.. హెల్త్ కార్డులకు ఎగనామం
  • బదిలీల బహుమానంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం

Telangana Govt Employees Protest | ప్రభుత్వానికి మంచిపేరు రావాలంటే ఉద్యోగులు సక్రమంగా పనిచేయాల్సి ఉంటుంది. వారు సక్రమంగా పనిచేయాలంటే వారికి అవసరమైన వసతులు, వారి సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని విస్మరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారి న్యాయమైన డిమాండ్లు పక్కనపెట్టిన ప్రభుత్వ విధానాలపై కొలువుదారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. డీఏలు, పీఆర్సీ లాంటి ఆకాంక్షలను ప్రభుత్వం అటకెక్కించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లపై సర్కారు దిగొచ్చినట్టు చేసి.. తీరా మొండిచేయి చూపిందని బాహాటంగానే మండిపడుతున్నారు. తమ పోరాటం మరింత ఉధృతం (Telangana Govt Employees Protest) చేస్తామని హెచ్చరిస్తున్నారు.

నోరు ఒకటనుకుంటే నొసలు వేరే అనుకున్నట్టు!

నోరు ఒకటనుకుంటే నొసలు వేరే అనుకున్నట్టు అనే సామెత ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలకు, సర్కారు అనుసరిస్తున్న విధానాలకు సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగులు తమకు హెల్త్ కార్డులు, మే 1 నుంచి నగదు రహిత వైద్యం, జూన్ 2 కల్లా మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ, ఏకమొత్తంగా పెండింగ్ బిల్లులు విడుదల, పాత పింఛన్ పునరుద్ధరణ, కరువు భత్తెం విడుదల చేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ, ప్రభుత్వం వీటన్నింటినీ పక్కన పెట్టి బదిలీల ఫైలును ముందేసుకోవడంపై ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగుల ఆకాంక్షను అటకెక్కించేందుకు రేవంత్రెడ్డి సర్కారు బదిలీల బాగోతానికి తెరలేపిందని మండిపడుతోంది.

ఉద్యోగులంటే చిన్నచూపు?

కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. ఉద్యమానికి సిద్ధమయ్యాయి. 206 సంఘాలు జత కట్టాయి. ఇటీవల లంచ్ టైంలో నిరసనలు చేపట్టారు. మరో జేఏసీ (లచ్చిరెడ్డి) అధికారులకు వినతిపత్రాలు సమర్పించింది. ప్రభుత్వ పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలోనూ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. దీంతో సర్కారు దిగొచ్చినట్టుగా చేసి.. బదిలీల అస్త్రాన్ని సంధించిందని ఉద్యోగులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మే ఒకటో తేదీ నుంచి హెల్త్ కార్డులు అందించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తే.. సర్కారు మాత్రం బదిలీల ప్రక్రియకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడాన్ని ఉద్యోగ సంఘాలు ఆకలింపు చేసుకోలేకపోతున్నాయి. ఉద్యోగుల పట్ల సర్కారు అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నారు. ‘డీఏ అంటే డిలే అలవెన్స్’ అని పీఆర్సీ అంటే “పెండింగ్ రివిజన్ కమిషన్’ అనే సెటైర్లతో పరోక్షంగా సర్కారును ఘాటుగా విమర్శిస్తున్నారు.

Telangana Govt Employees Protest : మే 5 నుంచి సమరమే..

ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆగ్రహంగా ఉన్న ఉద్యోగ సంఘాలు మరో సమరానికి సన్నద్ధమవుతున్నాయి. మే 5నుంచి రెండో దశ ఉద్యమానికి ఉద్యోగ జేఏసీలు పిలుపునిచ్చాయి. కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టాలని ఒక జేఏసే నిర్ణయించగా, మరో జేఏసీ(లచ్చిరెడ్డి) అదే రోజున కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించాయి. ఈ నిరసనలతోనైనా ప్రభుత్వం దిగొచ్చి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సిందే. లేదంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!