కవితక్క.. ఇదేం లెక్క!

Kalvakuntla Kavitha
  • పుట్టింటిపైనే నీలాపనిందలేల
  • ఆడబిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో
  • పుట్టింటిని కాదని ఉండగలరా!
  • పుట్టింటి పేరుతో అనుభవించిన పదవులు మరిచిపోయారా
  • లిక్కర్ కేసులో ఇరుక్కుంటే అన్యాయం జరిగిందన్న అన్ననే మరిచారా
  • తెలంగాణ ఆడపడుచులు కవితక్క వ్యాఖ్యలను సమర్థిస్తారా?

రాజకీయ లబ్ధి కోసం మహిళా లోకం పుట్టిల్లును వదలాలా.. అమ్మ పుట్టిళ్లు మేనమామకు తెలవదా అంటారు. కొత్తగా పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కు ఈ విషయం తెలియకుండా ఉంటుందా..! ఎందుకంటే ఇప్పటికీ ఆమె పుట్టింటి ఇంటి పేరునే మోస్తున్నారు. అందుకు కారణాలేవైనా, రాజకీయంగా ఆమె ఇప్పటివరకు అనుభవించిన పదవులన్నీ ఆ ఇంటిపేరు మీదే అనుభవించారు. మరి అలాంటి పుట్టింటిపై చీవాట్లు, నీలాపనిందలు వేయడం తెలంగాణలో ఏ ఇంటి ఆడపడుచు చేయదేమో!?. అత్తింట్లో గానీ, మరెవరైనా తన పుట్టింటిని అగౌరవపరిచేలా కించిత్ మాట్లాడితే మహిళలు ఎవరూ సహించలేరనేది అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా మగవారు ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఎంతోమంది మగవారు పెళ్లిళ్లయ్యాక అత్తవారింటిని ఆడిపోసుకోవడం సర్వసాధారణం. ఆ విషయంలో వారి భార్యలు ఎలాంటి గొడవలకైనా సిద్ధపడుతుంటారనేది తెలియంది కాదు. పండుగలకు పుట్టింటి వారు పట్టుచీర పెట్టకపోయినా సర్దుకుపోయే సున్నిత మనస్తత్వం కలిగిన మహిళలు ఉన్న తెలంగాణలో ఒక మహిళ, రాజకీయ నాయకురాలు, మహిళా లోకానికి ఆదర్శంగా నిలవాల్సిన కల్వకుంట్ల కవిత తన పుట్టింటిపై అవాకులు, చవాకులు పేల్చడం ఏం సందేశమిస్తున్నట్టు అనే సందేహాలు కలుగుతున్నాయి.

రాజకీయాల్లోకి వస్తే తప్పదేమో!?

రాజకీయాల్లో మిత్రులు శత్రువులవుతారు.. శత్రువులు మిత్రులవుతారనే ఇప్పటివరకు విన్నాం. కానీ, నేడు కుటుంబ సభ్యులు కూడా శత్రువులుగా మారుతారని కల్వకుంట్ల కవిత తన రాజకీయాలతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. శనివారం ఆమె కొత్త పార్టీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె తన పుట్టింటి వారి (KCR)పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం.. అనే సామెత ఉంది. అది కవితకు సరిగ్గా సరిపోతుందేమో అన్న సందేహం కలుగక తప్పదు. పుట్టింటి పార్టీ నుంచే రాజకీయంగా ఎదిగిన ఆమె.. నేడు కొత్త పార్టీ పెట్టి.. ఆ పార్టీనే (బీఆర్ఎస్) ఓ తప్పుల తడక అంటూ తిట్టిపోయడం విస్మయానికి గురి చేస్తోంది. దాదాపు 20 ఏండ్లు తండ్రి చాటు బిడ్డగా, అన్న చాటు ఆడపడుచుగా తెలంగాణ ప్రజల ఆదరణ పొందుతూ.. అయ్య పెట్టిన పార్టీలో పలు పదవులు అనుభవించిన కవిత చివరకు తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమే కాదు.. పుట్టింటి పరువును తీయడానికి కూడా వెనకాడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏ మహిళా కూడా పుట్టింటివారిని పల్లెత్తు మాట అన్నా.. కాకతీయ వారసత్వం పుణికిపుచ్చుకున్న పోరుబిడ్డగా శివాలెత్తిపోతారు. మరీ.. ఒకదశలో తెలంగాణ ఆడపడుచు అంటూ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కీర్తించిన కవితక్క(Kalvakuntla Kavitha).. నేడు ఆ పుట్టింటి వారిపైనే అక్కసు వెళ్లగక్కడం అతిశయోక్తి అనిపిస్తోంది. నాడు లిక్కర్ కేసులో ఇరుక్కున్నప్పుడు తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ నెరపిన లాబీయింగ్తోనే కవితక్క బయటకు వచ్చిందన్న ప్రచారం తెలంగాణ సమాజంలో ఉంది. నిజామాబాద్లో ఎంపీగా ఓటమి చవిచూసిన కవితకు ఎన్ని విమర్శలు వచ్చినా ఎమ్మెల్సీ ఇచ్చింది కూడా తండ్రినే కదా! పుట్టింటిని తమ ఆత్మగౌరవంగా భావించే మహిళాలోకం కవితక్కను సమర్థిస్తుందా? మహిళలంతా పుట్టింటిని వదిలి ఉండగలరా? అన్న ఆత్మీయతను, చెల్లెలి అనుబంధాన్ని,, తల్లిదండ్రుల మమకారాన్ని ఇట్టే మరిచిపోగలరా? కవితక్కనే సెలవివ్వాలి.

బతుకమ్మ నేర్పింది ఇదేనా?

తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ. గిన్నీస్ రికార్డుల్లోకి కూడా చోటు సంపాదించింది. అలాంటి బతుకమ్మకు తాను అంబాసిడర్ ను అంటూ కవితక్క చెప్పుకోవడం అందరికీ తెలిసిందే. మరి.. ఆ ఆట నేర్చింది.. పుట్టింటి వారే కదా! నేల విడిచి సాము చేయరాదనే నానుడిని మరిచి.. పుట్టింటిని మరిచి ఇంతస్థాయికి చేరుకున్నావా..? కవితక్కేసెలవివ్వాలి. కేవలం రాజకీయ స్వార్థం కోసమో, లేదా మరే ఇతర ప్రయోజనాల కోసమో పుట్టింటిని తిట్టేవారిని సమాజంలో ఎవరూ మన్నించరనే విషయాన్ని కవితక్క మరిచిపోకూడదు. వదిన వద్దన్నా.. అన్న మాట్లాడకపోయినా, తమ్ముడు తలెత్తి చూడకపోయినా, మరదలు మందలించకపోయినా, తండ్రి పట్టించుకోకపోయినా.. అమ్మ కోసమో, ఆత్మీయులైన అన్నదమ్ముల పిల్లల కోసమో.. అత్తింట్లో కుంటిసాకులు చెప్పయినా.. తెలంగాణ ఆడపడుచులు పుట్టింటికి వెళ్లేందుకు కట్టుబట్టలతో ప్రయాణానికి సిద్ధంగా ఉంటారనేది కవితక్క గుర్తుకు తెచ్చుకోవాలి. పుట్టింటిని తిట్టిపోస్తున్న కవితక్క.. తన పార్టీలో ఒక పదం మార్చి.. చివరకు పుట్టిల్లు పెట్టిన టీఆర్ఎస్ తోనే ప్రజల్లోకి వెళ్తున్నారనే విషయాన్ని గమనించుకోవాలి. అంతేగానీ, పుట్టింటిని తిడితేనే రాజకీయంగా ఎదుగుతామనుకొని ఇష్టారీతిగా మాట్లాడితే.. తెలంగాణ మహిళాలోకం తమ పుట్టింటిపై ఉన్న మమకారాన్ని తుంచుకోలేరు సరికదా! కవితక్క వ్యాఖ్యలను ఏకీభవించలేరనేది సత్యం.. సహి!!


మా తాజా వార్తల కోసం సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి:
WhatsApp Channel Facebook Page Follow on X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!